* వామపక్షాల విజ్ఞప్తి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీల అమలు, ప్రత్యేకహోదా సాధన అంశాలను రాష్ట్ర పార్లమెంటు సభ్యులందరూ ఐక్యంగా శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని వామపక్షాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు శుక్రవారం పి.మధు (సిపిఎం), కె.రామకృష్ణ (సిపిఐ), వై.సాంబశివరావు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసి, గుర్రం విజయకుమార్ సిపిఐ(ఎంఎల్), కాటం నాగభూషణం ఎంసిపిఐ(యు), బి బంగార్రావు సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసి, పివి సుందరరామరాజు (ఫార్వర్డ్‌బ్లాక్), జానకిరాములు (రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ) ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రకటన సారాంశం.. మోడీ ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీ, రాజధాని నిర్మాణం, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం, కేంద్రీయ విద్యాసంస్థల ఏర్పాటు వంటి వాటికి అరకొర నిధులను విదిల్చింది. విశాఖ రైల్వేజోన్ ఇచ్చి, డివిజన్ ఇవ్వలేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టుల నిర్మాణం లాభదాయకం కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరారు పార్లమెంటులోనే చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశం ముగిసిన అధ్యాయమని కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు మాట్లాడడం దుర్మార్గం. గత పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు వేసిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకహోదా ఇచ్చే ఆలోచన లేదని సాక్షాత్తు ప్రధాని మోడీ చెప్పడం ఆయన ద్వంద్వవైఖరికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా అన్యాయం చేసింది. ఈ నేపథ్యంలో ఎపికి విభజన హామీల అమలు, ప్రత్యేకహోదా సాధన కోసం పార్లమెంటులో ఒకరోజు ప్రత్యేక సెషన్ జరపాలని కేంద్రాన్ని రాష్ట్ర ఎంపిలు డిమాండ్ చేయాలి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రత్యేకహోదా, విభజన హామీల సాధనకై రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలు, సంస్థలతో తక్షణం అఖిలపక్ష సమావేశం జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని పక్షాలనూ కలుపుకుని రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంపై ఉద్యమించి సాధించాల్సిందిగా కోరారు.
ప్రత్యేకహోదా సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలి
