''సాధారణంగా సినిమా విడుదలైన తరవాత హిట్టయినా? ఫ్లాపయినా? క్రెడిట్ మొత్తం హీరోకి కట్టేస్తారు. హిట్టయితే హీరో బాగా చేశాడని, మంచి కథ ఎంపిక చేసుకున్నాడని అంటారు. ఫ్లాప్ అయి, డబ్బులు పోతే హీరో ఓపెనింగ్స్ తీసుకురాలేకపోయాడని అంటారు. ఇప్పుడు సందీప్ కిషన్ నిర్మాత అయ్యాడు కాబట్టి గుడ్ ఆర్ బ్యాడ్ అతణ్ణి డైరెక్టుగా అనొచ్చు. నేను కలసిన వెరీ వెరీ గుడ్ యాక్టర్స్‌లో సందీప్ కిషన్ ఒకడు'' అని హీరో సుధీర్ బాబు అన్నారు.
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా శుక్రవారమే విడుదల కానుంది. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు హీరోలు పాల్గొన్నారు.
సుధీర్‌బాబు మాట్లాడుతూ 'సందీప్ కిషన్ సినిమాలను బాగా విశ్లేషిస్తాడు. అతని చివరి రెండు సినిమాలూ అంచనాలను చేరుకోలేదు. ఇప్పుడు అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. టీమ్ అందరినీ ప్రోపర్గా సెట్ చేసుకున్నాడు. హృదయం, మనసు పెట్టి సినిమా చేశాడు. తప్పకుండా హిట్ అవుతుంది. ఇప్పుడు నాకు కూడా ఇంకో నిర్మాత దొరికాడు. తనతో మాత్రమే కాకుండా, ఇతరులతో సందీప్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. నాకు ఫ్లాప్స్ వస్తే డిప్రెషన్లోకి వెళ్లిపోతా. ఎప్పుడైనా వరుసపెట్టి రెండుమూడు ఫ్లాప్స్ వస్తే సందీప్ కిషన్‌ని గుర్తు చేసుకుంటా. అతను ఫైట్ చేసిన తీరును గుర్తు చేసుకుంటా'' అని అన్నారు.
నిఖిల్ మాట్లాడుతూ 'వెన్నెల కిషోర్‌తో నా సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు క్యాజువల్‌గా 'నిను వీడని నీడను నేనే' బాగా వస్తుందని చెప్పాడు. కొంతమందికి కాల్ చేశా. అందరూ బాగా వస్తుందని చెప్పారు. వెంటనే సందీప్ కిషన్‌కి ఫోన్ చేసి 'నేను కూడా నీ సినిమాలో ప్రొడ్యూసర్‌గా జాయిన్ అవ్వొచ్చా?' అని అడిగా. సాధారణంగా నేను డబ్బులు పెట్టడానికి ఆలోచిస్తా. కానీ, టాక్ విని డబ్బులు పెట్టాలనుకున్నా. చాలామంది నిర్మాతలు ఉన్నారని చెప్పాడు. జీవితంలో మనం కింద పడతాం. పైకి లేస్తాం. ఎప్పుడూ డిజప్పాయింట్ అవ్వకూడదు. ఈ సినిమా తరవాత సందీప్ కిషన్ పైన ఉంటాడు. తను పైకి లేచే టైమ్ మొదలైంది. ఎవరూ ఆపలేరు'' అని అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ 'ఫస్ట్‌టైమ్ చెబుతున్నా, అదిరిపోయే సినిమా తీశా. పక్కా హిట్. అది నేనొక్కడినే తీశానని చెప్పడం లేదు. టీమ్ కృషి వల్ల కుదిరింది. నిజాలు మాట్లాడుకోవాలంటే ఈ రోజు ఉదయం వరకూ సినిమా విడుదల అవుతుందో? లేదో? మాకూ తెలియదు. అంత టెన్షన్. నాకు తెలిసింది ఒకటే. కథను నమ్మాలి. ఆ కథను బాగా తీయాలి. కరెక్టుగా ప్రమోట్ చేయాలి. జనాల్లోకి తీసుకువెళ్లాలి. మన పని మనం చేసుకుంటూ వెళతాం. కానీ, ఒకడు ఒక సినిమా తీస్తున్నాడంటే... సంబంధమే లేకుండా ఆ సినిమాను ఆపడానికి బయలుదేరతారు. అందరి కన్నా.. అన్నిటి కన్నా సినిమా గొప్పది. ఆ సినిమాను ఆ సినిమా కాపాడుకుంటూ వస్తుంది. అదే 'నిను వీడని నీడను నేనే'. ఈ సినిమాకు విపరీతమైన అడ్డంకులు వచ్చాయి. నాకే షాక్. 'ఎస్ఎమ్ఎస్'కి 77మంది దగ్గర అప్పు చేస్తే గానీ సినిమా కుదరలేదని సుధీర్ బాబు చెప్పాడు. ఒక మనిషి 77 మంది దగ్గర అప్పు ఎలా చేస్తాడని నాకు అర్థం కాలేదు. ఇవాళ నాకు అర్థమైంది' అని తెలిపారు.
సాకు ఫ్లాప్స్ వస్తే సందీప్‌నే గుర్తుచేసుకుంటా - - సుధీర్ బాబు
