భూ సంస్కరణలు - అవరోధాలు
మనదేశంలోనూ, రాష్ట్రంలోనూ భూ సంస్కరణలు అమలు ఆశించినంతగా లేదని పేర్కొనవచ్చు. వ్యవసాయం ప్రధాన వ్యాపకం గల మన దేశంలో భూమికున్న ప్రాధాన్యత ఎనలేనిది. కేవలం ఆస్థిపరంగానేగాక ఉత్పాదక వనరు కావడం వల్ల మన దేశంలో భూమికి కీలకమైన ప్రాధాన్యత ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశంలోనూ, మన రాష్ట్రంలోనూ భూ సమస్యలు రాజకీయ ఉద్యమాలకు కేంద్రబింధువుగా ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూస్వామ్య వ్యతిరేక, జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు స్వాతంత్య్రానికి పూర్వమే జరిగాయి. 'దున్నేవాడిదే భూమి' అనే నినాదం స్వాతంత్రోద్యమ కాలంలోనే వినిపించింది. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన హైదరాబాద్ విమోచన ఉద్యమం భూ సమస్య కేంద్రంగా జరిగింది. స్వాతంత్య్రానంతరం దాదాపు అన్ని రాజకీయ పార్టీలు భూ సంస్కరణలకు తమ రాజకీయ అజెండాలో కీలక స్థానం కల్పించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్న పరిస్థితుల కనుగుణంగా చట్టాలను తెచ్చాయి.
అయినప్పటికీ భూ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. భూ సంస్కరణలకు ప్రధానంగా అవరోధాలేంటి ? ఆటంకంగా వస్తున్న అంశాలేంటి అనే విషయాలను పరిశీలిస్తే..
1. రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం
భూ సంస్కరణల అమలులో రాజకీయ చిత్తశుద్ధి కొరవడిందని కోనేరు రంగారావు కమిటీ పేర్కొంది. భూ సంస్కరణలను నిబద్ధతతో, చిత్తశుద్ధితో అమలు చేయాలన్న దృఢసంకల్పం ఉన్నతస్థాయి రాజకీయ నాయకత్వంలో లోపించింది. ప్రధానంగా భూమికి, గ్రామీణ ప్రాంతంలో రాజకీయ, సామాజిక ఆధిపత్యానికి సన్నిహిత సంబంధం ఉంది. ఒకవేళ ప్రభుత్వాలు నిజాయితీగా చట్టాలు చేసినా గ్రామీణస్థాయి నాయకత్వం భూ పంపకం పట్ల విముఖత చూసిస్తూ వచ్చింది. ఈ నాయకత్వం తమ వర్గాల లేదా కులాల ప్రయోజనాలకు ఇచ్చినంత ప్రాధాన్యత భూమిలేని పేదల అభివృద్ధికి ఇవ్వకపోవడం వల్ల భూ సంస్కరణల అమలు ఆశించినంతగా జరగడం లేదు.
అంతేగాక సీలింగ్ భూములు అనుభవిస్తున్న పెద్దలు వివిధ రాజకీయ పార్టీలలో కీలకమైన పాత్ర పోషించడం లేదా భూస్వామ్య వర్గాలను ఎదిరించే సాహసాన్ని అవి చేయలేకపోవడం. అంతేగాక ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం, పార్టీ విరాళాల కోసం భూస్వాములపై ఆధారపడడంతో భూస్వాములకు అనుకూలమైన అంశాలను, లొసుగులను చట్టంలో పొందుపరచడం వల్ల సంస్కరణల అమలులో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి.
2. భూ వివాదాలు
భూ సంస్కరణల చట్టంలోని అనేక లొసుగులను భూస్వాములు వినియోగించుకోవడం ద్వారా వీటి అమలుకు న్యాయపరమైన జాప్యం, చిక్కులు ఏర్పడేందుకు కారణమవుతున్నాయి. భూ వివాదాలు దీర్ఘకాలంగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉండటం వల్ల భూ పంపకానికి అవరోధాలు ఏర్పడుతున్నాయి. కొన్ని సందర్భాలలో దశాబ్దాల తరబడి భూ వివాదాలు పెండింగ్‌లో ఉండటం వల్ల భూ సంస్కరణలు అమలుకు తీవ్ర జాప్యం ఏర్పడుతుంది. భూస్వామ్య వర్గాలకు భూ సంస్కరణలను అడ్డుకునేందుకు లిటిగేషన్స్ సులువైన పద్ధతిగా మారిపోయింది.
3. లోపభూయిష్టమైన యంత్రాంగం
భూ సంస్కరణల అమలుకు మరో ప్రధానమైన అవరోధం లోపభూయిష్టమైన అధికార రెవెన్యూ యంత్రాంగం అని పేర్కొనాలి. అవినీతిపరులైన రెవెన్యూ అధికారులు భూస్వాములకు కొమ్ముకాస్తూ, అవినీతికి పాల్పడుతూ సంస్కరణల అమలులో అవరోధాలు సృష్టిస్తున్నారు. అనేక ప్రాంతాలలో సంస్కరణలకు సంబంధించి పేదలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల అవినీతి యంత్రాంగం తమకు అనువుగా మార్చుకుంటుంది.
4. భూ రికార్డుల్లో లోపాలు
గ్రామీణ స్థాయిలో భూ రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల భూ సమస్యలు జఠిలంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సామాజికంగా, రాజకీయంగా బలమున్న వర్గాల ప్రయోజనం ఇమిడి ఉండడంతో భూ రికార్డులపై పారదర్శకమైన అజమాయిషీ లేకుండా పోయింది. భూ యాజమాన్య హక్కులు స్పష్టంగా ఉన్నప్పుడే భూ వివాదాలను పరిష్కరించగలం. భూమి రికార్డులను క్రమబద్ధీకరించక పోవడం వల్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. భూ రికార్డులు స్పష్టంగా లేకపోవడం వల్ల, భూ గరిష్ట పరిమితి చట్టాలు, కౌలు చట్టాల నుంచి భూస్వాములు సులువుగా తప్పించుకోగలుగుతున్నారు.
5. భూ పరాయీకరణ
అనేక కారణాల వల్ల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. అగ్రవర్ణాలకు చెందిన భూస్వాములకు భయపడి, వారితో ఘర్షణ పడలేక పేదలు ముఖ్యంగా షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలకు చెందిన రైతులు తమ భూములు కోల్పోతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో భూ పరాయీకరణ ప్రధాన సమస్యగా మారిపోయింది. వ్యవసాయం గిట్టుబాటుగాక చిన్న, సన్నకారు రైతులు రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్నారు. రుణ విముక్తి కోసం లేదా కొత్త రుణాల కోసం భూములను తెగనమ్ముకొంటున్నారు.
భూ సంస్కరణలు సమర్థవంతంగా అమలు చేయడానికి సూచనలు
భూ సంస్కరణల వల్ల గ్రామీణ ప్రాంతంలో పేదరికం, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తి పెరిగి, దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. అందువల్ల వీటిని అమలుచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
1. అన్నిరకాల సామాజిక, ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారం భూ సంస్కరణలే కాబట్టి ప్రభుత్వ భూ సంస్కరణలను పటిష్టంగా అమలు చేయడానికి తగిన చర్యలు చేపట్టాలి. భూ చట్టాలు ఎటువంటి లొసుగులూ లేకుండా రూపొందించాలి. భూ సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయడానికి పటిష్టమైన రాజకీయ, పాలనాపరమైన సంకల్పబలం కావాలి.
2. కోనేరు రంగారావు కమిటీ సూచించినట్లు భూ సంస్కరణల అమలుకు స్వయంప్రతిపత్తి గల సమాంతర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్కువగా వెనకబడిన తరగతులకు చెందిన సమర్థులైన, నీతిపరులైన, చిత్తశుద్ధిగల యువ అధికారులను నియమించాలి.
3. భూ రికార్డులను సమాచార, సాంకేతిక పరిజ్ఞానం ఉపయో గించి, ఎప్పటికప్పుడు క్రయవిక్రయ యాజమాన్య నిర్వహణ వివరాలను రూపొందించాలి. భూమిపై యాజమాన్య హక్కుల స్పష్టత ఉన్నప్పుడే భూ వివాదాలను పరిష్కరించగలము. భూముల రికార్డులన్నింటినీ డిజిటలైజేషన్ చేయాలి.
4. భూ వివాదాలకు సంబంధించి అన్ని కేసులను త్వరితగతిన విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి.
5. భూ సంస్కరణల అములను పర్యవేక్షించడానికి బలహీన వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, పంచాయితీ ప్రతినిధులు, వ్యవసాయ కార్మిక సంఘాలతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలి.
6. భూ పంపిణీలో భాగంగా పేదలకు వ్యవసాయ యోగ్యమైన భూములను పంపిణీ చేయాలి. ఒకవేళ బంజరు భూములను పంచితే వాటిని సాగు చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి.
7. భూ సంబంధిత చట్టాలకు సంబంధించి గ్రామీణ ప్రజలకు విస్తృత అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. ఇందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల సహకారం తీసుకోవాలి.
8. భూ సంస్కరణల్లో భూ పంపకం తొలిమెట్టు మాత్రమే. దీంతో పాటు రుణం, ఎరువులు, ముడి సాధనాలు అందుబాటులో ఉంచాలి. ఉత్పాదకతను పెంచాలి. గిట్టుబాటు ధరలను కల్పించాలి. మార్కెటింగ్ సౌకర్యాలను విస్తరించాలి. అప్పుడే పంపిణీ అయిన భూమి లబ్ధిదారుల చేతుల్లో ఉంటుంది. భూ పంపకం నిరుపేదల సాధికారతకు బాటలు వేస్తుంది.
- ఎస్.ఎం.సువర్ణకుమార్
డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్, ఏలూరు.
సెల్ : 9441169869