ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు
ప్రజాశక్తి-గుంటూరు
అధ్యాపక ఉద్యమ నేత ఎం.జె మాణిక్యరావు ఆశయ సాధనకు కృషి చేయాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఎంజె మాణిక్యరావు వర్థంతి సందర్భంగా స్తానిక ఏసీ కాలేజి రోడ్డులోని ఆయన విగ్రహానికి లక్ష్మణరావు, నాగార్జునా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రాజశేఖర్, ఆర్జెడి వెలగా జోషి, ఆక్టా అధ్యక్షులు కె.మోహనరావు తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఎయిడెడ్ కాలేజిల అభివృద్ధికి, అధ్యాపకులు సమస్యల పరిష్కారానికి మాణిక్యరావు ఎంతో కృషి చేశారన్నారు. అయితే గత 15 ఏళ్ల క్రితం విడుదల చేసిన జిఒ 35 వల్ల కొత్త రిక్రూట్మెంట్ లేక, కాలేజీలు క్షీణించిపోతున్నాయని చెప్పారు. ఎయిడెడ్ కాలేజిల్లో అన్ ఎయిడెడ్ అధ్యాపకులకు మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు మోజేస్, కిరణ్, దుర్గా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.