ఓ రవిని....!!
నా కలం సిరాలో
వేడి పొడలు నిండుగానే వున్నాయి!
నిద్రపోతున్న మానవత్వానికి
మేలుకొలుపు రాయమంటాడు ఒకడు...
అంధకారంలో అలమటిస్తోన్న మానవ జాతికి
అక్షర జ్యోతిని వెలిగించి
వెలుగు బాట చూపమంటాడు మరొకడు...
మదమెక్కి మారణ హోమం సృష్టిస్తోన్న
మృగ సంతతికి నీతి వాక్యాలు రాసి
హిత బోధ చేయమంటాడు వేరొకడు...
నన్ను ఆదరించేవాడు నా పలుకుల్ని ఆలకించేవాడు
శూన్యంతో సహజీవనం చేస్తున్నాడు!
చుక్కాని పెట్టి వెతికినా కనిపించడు...!!
సమాజ సంక్షేమం... సాంస్కృతిక వికాసం...
ఎవ్వరికీ అక్కర్లేదిప్పుడు....!
నేను.. నా కుటుంబం...
బాగుంటే చాలు....!
పక్కింటి వాడు ఏమైపోతేనేం.....!?
ఎదురింట్లో మనుష్యులు
ఏ గంగలో కలిస్తే నాకేం....!?
నరజాతి చరిత్ర సమస్తం
స్వార్థం ఊబిలో కూరుకుపోయిన ఈ వేళ
బాధ్యత నా ఒక్కడిదేనా!
నా రాతలు.. నా కవితాక్షరాల తీక్షణ జ్వాలలు...
నిద్ర నటిస్తోన్న పాలకుల్ని
స్పందింపజేయుట సాధ్యమా..?
మద్యపానం చట్ట సమ్మతం నేడు!
దొంగతనాలు దోపిడీలు...
మానభంగాలు మారణ హోమాలు..
అంతేనా..!
అత్యున్నత న్యాయస్థానం ఆదేశం..?
వ్యభిచారానిక్కూడా రేపు లైసెన్స్!
పాలకుల అరాచక పాలనకు
జేజేలు పలుకుతోన్న చదువుకున్న మూర్ఖులకు
నా ప్రబోధ గేయాలను ఆలకించేలా
నా కవితా గానం వినిపిస్తాను...!
చీకటి దారుల్లో పయనిస్తోన్న
సభ్య సమాజ మానవాళికి
సమ సమాజ నిర్మాణ ధ్యేయాన్ని
అంతిమ గమ్యంగా నిర్దేశిస్తాను!
వెలుగు దివిటీనై... అభ్యుదయ పథాన...
ముందుకు మున్ముందుకు సాగుతాను!