- తుదిపోరుకు కివీస్
- సెమీస్‌లో చేతులెత్తిసిన
- భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్
- 18 పరుగులతో న్యూజిలాండ్ గెలుపు
- జడేజా పోరాటం, ధోని అర్థ సెంచరీ వృధా
కోట్లాది మంది భారతీయుల ఆశలను వమ్ము చేస్తూ టీమిండియా సెమీ మెట్టుపై బోల్తా పడింది. మూడో సారి విశ్వ విజేతగా నిలుస్తుందని నమ్మకం పెట్టుకున్న భారత్ జట్టు తుదిపోరుకూడా చేరుకోవడంలో విఫలం చెందింది. గ్రూప్ దశలో అగ్రస్థానంతో నాకౌట్లోకి ప్రవేశించిన కోహ్లి సేన సెమీస్‌లో చిత్తయింది. 240 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. టాప్ ఆర్డర్ విఫలం చెందిన వేళ జడేజా, ధోని పోరాటంతో కొద్ది సేపు జట్టు విజయం ఆశలు చిగురించాయి. అయితే స్వల్ప తేడాతో ఈ ఇద్దరూ పెవిలియన్‌కు చేరుకోవడంతో జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఇంటిదారి పట్టింది. ప్రపంచకప్ టోర్నీల్లో భాగంగా న్యూజిలాండ్ మాంచెస్టర్‌లో మూడు సార్లు సెమీస్ ఆడింది. 1979లో ఇంగ్లండ్, 1999లో పాక్ చేతిలో ఓడింది. కానీ నేడు 2019లో భారత్‌పై విజయం సాధించింది.
మాంచెస్టర్ : ప్రపంచకప్ సెమీ ఫైనల్లో భారత బ్యాట్స్‌మెన్ బోల్తాపడ్డారు. న్యూజిలాండ్ విధించిన 240 స్వల్ప లక్ష్య ఛేదనలో దారుణంగా విఫలం చెందారు. రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లి, కెఎల్ రాహుల్‌లు ఒక్క పరుగుకే పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ రవీంద్ర జడేజా (77 పరుగులు, 59 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు) పోరాటం వృధాగా మారింది. ధోని (72 బంతుల్లో సిక్స్, ఫోర్‌తో 50 పరుగులు) అర్థ సెంచరీ చేసినా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. ఛేదనలో 49.3 ఓవర్లలోనే భారత్ 221 పరుగులకే ఆలౌటయింది. కివీస్ 18 పరుగులతో విజయం సాధించింది. ప్రపంచకప్‌లో వరసగా రెండో సారి కూడా ఫైనల్‌కు చేరుకుంది.
టాప్ ఆర్డర్ వైఫల్యం
240 లక్ష్య సాధనలో 5 పరుగులకే భారత్ టాప్ అర్డర్ నిష్క్రమించింది. రోహిత్, కోహ్లి, రాహుల్‌లు తలా ఒకోక్క పరుగుచేసి అవుటయ్యారు. ఈ తరువాత దినేష్ కార్తీక్ (6) కూడా నిరాశ పర్చాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రుషిబ్ పంత్- పాండ్య జోడీ జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించింది. అయితే జట్టు స్కోరు 71 పరుగుల వద్ద పంత్ 22.5 ఓవర్లో అవుటయ్యాడు. 5 వికెట్‌గా అవుటైన పంత్ 56 బంతుల్లో నాలుగు ఫోర్లతో 32 పరుగులు చేశాడు. తరువాత పాండ్యతో కలిసి పంత్ 5వ వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. పంత్ అవుట్‌తో పాండ్యకు ధోని జతకలిశాడు. 31 ఓవర్లో పాండ్యా కూడా అవుటయ్యాడు. 6వ వికెట్‌గా అవుటైన పాండ్య 62 బంతుల్లో రెండు ఫోర్లతో 32 పరుగులు చేశాడు. పాండ్యా అవుట్‌తో ధోనికి జడేజా జతకలిశాడు. జడేజా ఆరంభం నుంచి దాటిగా ఆడాడు. 42వ ఓవర్లోనే అతని అర్థ సెంచరీ పూర్తయింది. 48వ ఓవర్లో జడేజా ఒక భారీ షాట్ ఆడబోయే క్రమంలో ఏడో వికెట్‌గా అవుటయ్యాడు. 59 బంతులు ఆడిన జడేజా నాలుగు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 77 పరుగులు చేశాడు. ధోనితో కలిసి ఏడో వికెట్‌కు రూ 116 పరుగుల భాగస్వామ్యం సాధించాడు.
12 బంతుల్లో 31 పరుగులు
జడేజా విజృంభణతో చివరి రెండు ఓవర్లలోనూ విజయం కోసం 31 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ నిలిచింది. ఈ సమయంలో ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్లో తొలి బంతిని ధోని సిక్సర్ కొట్టాడు. అయితే రెండో బంతిని కీపర్ ఎండ్స్‌వైపు మళ్లించి రెండు పరుగులు తీసే ప్రయత్నం చేశాడు. అయితే రెండో పరుగు తీసే క్రమంలో ధోని తడబడ్డాడు. గప్టిల్ నేరుగా వికెట్లకు త్రో వేయడంతో ధోని రనౌట్ అయ్యాడు. కీలక సమయంలో ధోని రనౌట్ కావడం జట్టు విజయవకాశాలను తీవ్రంగా దెబ్బతిసింది. 72 బంతులు ఆడిన ధోని సిక్స్, ఫోర్‌తో 50 పరుగులు చేశాడు. 49 ఓవర్ చివరి బంతికి భువనేశ్వర్ (0) ఔట్ కాగా, 50 ఓవర్ మూడో బంతికి చహల్ (5) ఔటయ్యాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. బుమ్రా (0) నాటౌట్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా, ట్రెంట్ బౌల్ట్,సాంత్నార్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. ఫెర్గుసన్, నీషమ్‌లకు చెరో వికెట్ లభించింది.
వర్షం కారణంగా మంగళవారం నిలిచి పోయిన ఆటను బుధవారం కొనసాగించారు. మంగళవారం ఆటను నిలిపివేసే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లుకు 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఇక్కడ నుంచి ఆటను కొనసాగించారు. రెండో రోజు 23 బంతులు ఆడిన కివీస్ 28 పరుగులు చేసింది. 3 వికెట్లు చేజార్చుకుంది. మొత్తానికి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. బుధవారం మొదటి బంతి నుంచే భువనేశ్వర్ కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ పాటించాడు. దాంతో కివీస్ కేవలం ఒక్క బౌండరీనే సాధించింది. 46.2వ బంతి నుంచి ఆట ఆరంభమైంది. ఆ ఓవర్లో 8 మొత్తంగా 8 పరుగులు వచ్చాయి. రాస్ టేలర్ (74 పరుగులు, 90 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్), టామ్ లేథమ్ (10 పరుగులు, 11 బంతుల్లో) వికెట్ల మధ్య చకచకా సింగిల్స్ తీశారు. 48వ ఓవర్ చివరి బంతికి రెండో పరుగు తీయబోయి టేలర్ రనౌట్ అయ్యాడు. జడేజా అద్భుతమైన త్రోతో అతన్ని పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత 49వ ఓవర్లో భువనేశ్వర్ బౌలింగ్‌లో తొలి బంతికే భారీ షాట్ ఆడబోయిన లేథమ్ మళ్లీ జడేజాకే క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఓవర్లో చివరి బంతికి కోహ్లికి క్యాచ్ ఇచ్చి మ్యాట్ హెన్రీ (1) ఔటయ్యాడు. కివీస్ ఇన్నింగ్స్ ముగిసే సరికి శాంట్నర్ (9 పరుగులు, 6 బంతుల్లో ఒక ఫోర్), బౌల్ట్ (3) నాటౌట్‌గా ఉన్నారు.
45 నిమిషాల ఆటే దెబ్బతీసింది : కోహ్లి
న్యూజిలాండ్ చేతిలో ఓటమిపై భారత్ కెప్టెన్ విచారం వ్యక్తం చేశాడు. ప్రారంభంలోనే కీలక వికెట్లను చేజార్చుకోవడంతో ఓటమి చెందామని తెలిపాడు. లక్ష్యం స్వల్పమే అయినప్పటికీ విఫలం కావడం నిరాశపరిచిందన్నాడు. కివీస్ బౌలర్లు రైట్ లెంగ్త్ బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో తాము ఆదిలోనే ప్రధాన వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడ్డామన్నాడు. 'మంగళవారం మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. బుధవారం కూడా న్యూజిలాండ్‌ను భారీ పరుగులు చేయకుండా కట్టడి చేశాం. కివీస్ మా ముందు ఉంచిన లక్ష్యం పెద్దది కాదు. కానీ చేజేతులా మ్యాచ్‌ను కోల్పోయాం. సెమీస్‌లోనే వైదొలగడం నిరాశను మిగిల్చింది. ఈ వరల్డ్‌కప్‌లో మా ప్రదర్శన బాగానే ఉంది. నాకౌట్ సమరంలో మాత్రం అంచనాలు అందుకోలేకపోయాం. న్యూజిలాండ్ బౌలింగ్ యూనిట్ మాపై మొదట్నుంచీ ఒత్తిడి తెచ్చి విజయవంతం అయ్యింది. ఈ మ్యాచ్‌లో విజయం క్రెడిట్ అంతా కివీ బౌలర్లదే. మేము టోర్నీ అంతా ఆకట్టుకున్నా కేవలం 45 నిమిషాల పాటు చెత్తగా ఆడటం వల్లే నిష్క్రమించాం' అని తెలిపాడు. అలాగే జడేజా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ 'ఈ రోజు జడేజా ఆడిన తీరు అసాధారణం. ఒత్తిడిలో ఒక మంచి క్రికెట్ ఆడాడు. అతనొక నాణ్యమైన క్రికెటర్ అనడానికి ఈ ఇన్నింగ్స్ ఒక ఉదాహరణ. ఇప్పటికే జడేజా చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా, తాజా ఇన్నింగ్స్ అతని నైపుణ్యాన్ని మరింత బయటకు తీసుకొచ్చింది' అని కోహ్లి పేర్కొన్నాడు..
స్కోరు బోర్డు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : గుప్తిల్ (సి) కోహ్లి (బి) బుమ్రా 1, నికోలస్ (బి) జడేజా 28, విలియమ్సన్ (సి) జడేజా (బి) చాహల్ 67, టేలర్ రనౌట్ 74, నీషమ్ (సి) కార్తీక్ (బి) పాండ్య 12, గ్రాండ్ హోమ్ (సి) ధోని (బి) కుమార్ 16, లాథమ్ (సి) జడేజా (బి) కుమార్ 10, సాంత్నర్ నాటౌట్ 9, హెన్రీ (సి) కోహ్లి (బి) కుమార్ 1, బౌల్ట్ 3, ఎక్స్‌ట్రాలు 18, మొత్తం 239/8 (50 ఓవర్లు)
వికెట్ల పతనం : 1-1, 2-69, 3-134, 4-162, 5-200, 6-225, 7-225, 8-232.
బౌలింగ్ : భువనేశ్వర్ 10-1-43-3, బుమ్రా 10-1-39-1, పాండ్య 10-0-55-1, జడేజా 10-0-34-1, చాహాల్ 10-0-63-1.
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) లాథమ్ (బి) హెన్రీ 1, రోహిత్ (సి) లాథమ్ (బి) హెన్రీ 1, కోహ్లి ( ఎల్బీ) బౌల్ట్ 1, పంత్ (సి) గ్రాండ్‌హోమ్ (బి) సాంత్నర్ 32, కార్తీక్ (సి)నీషమ్ (బి) హెన్రీ 6, పాండ్య (సి) విలియమ్సన్ (బి) సాంత్నర్ 32, ధోని (రనౌట్) 50, జడేజా (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 77, భువనేశ్వర్ (బి) ఫెర్గుసన్ 0, చాహల్ (సి) లాథమ్ (బి) నీషమ్ 5, బుమ్రా నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 16, మొత్తం 221 ఆలౌట్ (49.3 ఓవర్లు)
వికెట్ల పతనం : 1-4, 2-5, 3-5, 4-24, 5-71, 6-92, 7-208, 8-216, 9-217, 10-221.
బౌలింగ్ : బౌల్ట్ 10-2-42-2, హెన్రీ 10-1-37-3, ఫర్గుసన్ 10-0-43-1, గ్రాండ్ హోమ్ 2-0-13-0, నీషమ్ 7.3-0-49-1, సాంత్నర్ 10-2-34-2.
భారత్ కథ ముగిసే
