చాలా పాత సినిమాలనో, వీడియోలనో చూసినవారికి వాటిలో ఓ వింత కనబడుతుంది. మనుషులు చీమల్లా చకచకా కదులుతున్నట్టు కనిపిస్తారు. ఫ్రేమ్‌ల సంఖ్య అప్పట్లో తక్కువ, అందుకే నిజజీవితంలో నిదానంగా కదిలే ముసలాడు కూడా పడుచు పిల్లాడిలా పరుగున నడుస్తాడు వాటిల్లో. నిజజీవతంలోను అలా యంత్రాల్లా పని చేస్తూ జపాన్ బుల్లెట్ రైళ్లను ఏడే నిమిషాల్లో శుభ్రం చేస్తున్న సెవెన్ మినట్ షింకాన్సెన్ థియేటర్ జట్టు గురించి తెలుసుకోవాల్సిందే. బుల్లెట్ రైళ్ల వేగంతో పోటీపడి చకచకా పనులు చక్కదిద్దేస్తున్న వారి కదలికలు పాత వీడియోల్లో చూసి నట్టే ఉంటుంది.
జపాన్ వేగవంతమైన బుల్లెట్ రైళ్ల చివరి మజిలీ టోక్యో స్టేషన్. వారి భాషలో షింకాన్సెన్ అని పిలిచే ఈ రైళ్లు అక్కడ కేవలం 12 నిమిషాల సేపే ఆగుతాయి. ఈ లోగా వాటిని శుభ్రం చేయాలి. అంత బారున్న రైళ్లను అణువణువూ తళతళలాడించాల్సిందే. రోజుకు 210 రైళ్లు పరుగులు తీస్తుంటాయి. వీటన్నింటినీ అతి తక్కువ కాలంలో శుభ్రపరిచే విషయంలో రైళ్ల శాఖకు తొలుత ఇబ్బందులు ఎదురయ్యాయి. అపరిశుభ్రతకు అణువంత చోటు కూడా ఉండకూడదనేది లక్ష్యం. దీనికి పరిష్కారంగా వారు ఓ జట్టును తయారు చేశారు. వేగంగా పని చేసేలా శిక్షణనిచ్చారు. ముఖ్యంగా వారు చేసే పనిపై గౌరవం కలిగేలా, వారు గర్వించేలా స్ఫూర్తి పాఠాల్ని బోధించారు. జపాన్ సంప్రదాయ ఓమోటెనాషి వసతులతో ఆకట్టుకున్నారు. తొమ్మిదేళ్లుగా ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకుంటూ 800 మందితో ఓ పక్కా జట్టును రూపొందించారు. పని భారం, భరింపరాని పని పరిస్థితుల నుంచి బయటపడేశారు. కొత్త తరహా పరికరాలను అందించారు. కార్మికుల మధ్య సుహృద్భావం పెరిగేలా ఎప్పటికప్పుడు సభ్యుల్ని మారుస్తూ స్నేహపూర్వక జట్లను తయారు చేశారు. ఓ ప్రత్యేకమైన యూనిఫామ్‌ను రూపొందించి కొత్తదనంతో పాటు ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. అంద మైన, సువాసనలు వెదజల్లే పూల టోపీలు, వేసవిలో హవా యి వస్త్రధారణతో సఫాయిలు ఉల్లాసంతో పాటు వారి సంతోషాన్ని ప్రయాణీకులకు పంచుతున్నారు.
వీరిని 22 మంది చొప్పున 11 జట్లను తయారుచేశారు. బుల్లెట్ రైలు వచ్చేపుడు వినమ్రంగా దానికి స్వాగతం చెబుతారు. రైలు ఆగగానే తలుపులకు ఇరువైపులా నిలబడి ప్రయాణీకులు తెచ్చే చెత్తను సేకరిస్తారు. ఆ తర్వాత చకచకా రైలులోకి కదిలి అంగుళం అంగుళం వెతికి శుభ్రం చేస్తారు. వంద సీట్లున్న ఒక్కో కారును ఒక కార్మికుడు శుభ్రం చేస్తారు. ప్రతి నిమిషానికి పక్కా ప్రణాళిక పెట్టుకుని పనిచేస్తారు. అలా ఒక్కో కార్మికుడు రోజుకు 20 రైళ్లకు పనిచేస్తారు. మంచి సేవ అనే ఎజెండాతో పనిచేసే వీరి సేవల్ని గుర్తిస్తూ నిక్కీ అనే వాణిజ్య పత్రిక
జపాన్‌లోనే అతి పటిష్టమైన జట్టుగా కీర్తించింది. వీరి పనితనం గురించి తెలుసుకున్న ప్రపంచంలోని ఇతర సంస్థల వారు ఆదర్శంగా తీసుకున్నారు. ప్రఖ్యాత మేనేజ్మెంట్ విశ్వవిద్యాలయం హార్వార్డ్ ఏకంగా ఓ బృందాన్ని పంపి వారి పనితీరుపై అధ్యయనం చేయించింది.
వారి విజయంలోని సూత్రాలను పాఠ్యాంశాల్లో పొందుపరిచేందుకు సిద్ధమైంది. ఫ్రాన్స్ రైల్వే శాఖ కూడా వీరిచే శిక్షణ తీసుకునేందుకు సిబ్బందిని ఎంపిక చేసింది. విఖ్యాత హాలీవుడ్ నటుడు, అమెరికన్ రాజకీయవేత్త ఆర్నాల్డ్ స్క్వాజినేగర్ అయితే జపాన్ పర్యటనలో ఉండగా వారి గురించి వాకబు చేసి, ప్రత్యేకంగా వెళ్లి వారు పనిచేసే విధానాన్ని గమనించాడు. వారి సేవకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు గుర్తుగా ఫొటో కూడా తీసుకున్నాడు. సంఘటితంగా పనిచేస్తూ, నూతన విధానాలను అమలు చేస్తూ మంచి గుర్తింపు పొందుతోంది ఆ జట్టు.