* నర్మదా వరద బాధితుల ఆవేదన
* ప్రభుత్వ ఉదాసీనతపై మిన్నంటిన నిరసనలు
* 2వేల మందికి పైగా ఆందోళన బాట
న్యూఢిల్లీ : పునరావాసం కల్పించడంలో మధ్యప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతను నిరసిస్తూ రాష్ట్రంలోని 178 గ్రామాల ప్రజలు భోపాల్ నగర వీధుల్లో ఆందోళన బాట పట్టారు. ఈ నిరసనలో రెండు వేల మందికి పైగా పాల్గన్నారు. 144 వంటి సెక్షన్ విధించినా, పోలీసులు పహారా కాసిన లెక్కచేయని ప్రజలు భోపాల్ నగరంతోపాటు, షాజహాని పార్క్ వద్దకు చేరుకుని నిరసన గళం వినిపించారు. గత ఆగస్టులో నర్మదా నది పొంగిపొర్లడంతో రాష్ట్రంలోని 192 గ్రామాలతో పాటు మహారాష్ట్రలో 33 గ్రామాలు, గుజరాత్లో 19 గ్రామాలు జలమయమయ్యాయి. మధ్యప్రదేశ్లోని 32 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పలువురు మృత్యువాత పడ్డారు. ధర్, బర్వానీ, అలీరాజ్పూర్లో ఏర్పాటు చేసిన 26 పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించారు.
31 నుంచి ఆహార సరఫరా నిలిపివేత
అక్టోబర్ 31 నుంచి వీరికి ఆహారం అందించడం నిలిపివేశారు. 'మాకు సరైన వసతులు లేవు. ఆహారం అందించడం లేదు. మా పరిస్థితులపై ఎవరూ స్పందించలేద'ని బాధితుల్లో ఒకరు, నర్మద బచావో ఆందోళన్(ఎన్బిఎ)లో పాల్గన్న రోహిత్ ఆవేదన వ్యక్తం చేశారు. షాజహాని పార్క్ వద్ద నిరసనలు తెలుపుతూ ముందుకు సాగుతున్న మా ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారని చెప్పారు.
నర్మదా వ్యాలీ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్విడిఎ) ఈ పునరావాస కేంద్రాలను నిర్వహిస్తోంది. ఎన్విడిఎ అధికారులు అక్టోబర్ 31 వరకు వారికి ఆహార సరఫరా చేసి, అనంతరం చేతులు దులుపుకున్నారు. అక్కడి వారంతా పనులకు పోయి, ఆదాయాన్ని పొందుతున్న నేపథ్యంలో దానిని పొడిగించలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ ఆకలితో అలమటిస్తున్నామని, తమకు న్యాయం జరిగేంత వరకు ఈ పునరావాస కేంద్రాలను విడిచి వెళ్లేది లేదని బాధితులు తెలిపారు. వరదల్లో పలువురు చనిపోవడంపై గతంలో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం అదుపులోకి తీసుకురావాలని ఢిల్లీలో ఆగస్టు 21న పెద్దయెత్తున నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.
'నో ఫుడ్, నో షెల్టర్'
