తాజా అధ్యయనంలో వెల్లడి
లండన్: బ్రిటిష్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం బ్రిటిష్ సైనికులు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లలో కొనసాగించిన యుద్ధ నేరాలను కప్పిపుచ్చి వాటికి సంబంధించిన ఆధారాలను తొక్కిపెట్టేందుకు ప్రయత్నించాయని తాజా అధ్యయనంలో వెల్లడయింది. బ్రిటన్కు చెందిన రెండు ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించిన ఈ అధ్యయన నివేదిక అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. ఈ రెండు దేశాలలో యుద్ధ విధులు నిర్వర్తించిన బ్రిటిష్ సైనికులు సామాన్య పౌరులను ముఖ్యంగా చిన్నారులను చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని ఈ అధ్యయన నివేదిక తెలిపింది. ఈ రెండుదేశాలపై జరిగిన దురాక్రమణ యుద్ధాలలో సైనికుల ప్రవర్తనపై రెండు ప్రభుత్వాలు నిర్వహించిన విచారణ వివరాలను అధికారికంగా నమోదు చేశారు. బ్రిటన్ ప్రభుత్వం అత్యంత గోప్యంగా వుంచిన ఈ పత్రాలు కొన్ని మీడియా సంస్థలకు చిక్కటంతో ఈ అధ్యయన నివేదిక బహిర్గతమైంది. బ్రిటన్ నిఘా సంస్థకు చెందిన ఎస్ఎఎస్ యూనిట్లోని ఒక సైనికుడు చేసిన హత్యల వివరాలు ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురి చేసే విధంగా వున్నాయి. ఇందులో లాకప్ డెత్లే కాక ఖైదీలను కొట్టి చంపడాలు, చిత్రహింసలకు గురి చేయటం, వార్డు కాపలా సిబ్బంది వారిపై లైంగిక దాడులకు పాల్పడటం వంటి అనేక అంశాలున్నాయి. దాదాపు ఏడాదికాలం నిర్వహించిన ఈ విచారణకు సహకరించిన అనేక మంది మిలటరీ డిటెక్టివ్లు ఈ విచారణ నివేదికను సీనియర్ అధికారులు 'రాజకీయ కారణాల రీత్యా' తొక్కిపట్టారని వివరించారు. అయితే బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ మాత్రం ఈ ఆరోపణలను పూర్తి అసత్యాలని తోసిపుచ్చింది. దర్యాప్తు అధికారుల నిర్ణయాలు పూర్తి స్వతంత్రమైనవని రక్షణశాఖ తన ప్రకటనలో వివరించింది. ఈ విచారణ ప్రక్రియపై ఒక న్యాయవాది దాదాపు వెయ్యికిపైగా ఆరోపణలతో సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయటంతో బ్రిటిష్ ప్రభుత్వం దీనిని 2017లో ఉపసంహరించుకుంది.
ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధ నేరాలను కప్పిపుచ్చిన బ్రిటన్
